చేప ప్రసాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చేప ప్రసాదం లేదా చేప మందు అనేది ఉబ్బసం వ్యాధిని నివారించుటకు ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున బత్తిని సోదరులు పంపిణీ చేసే మందు.[1]

బత్తిని సోదరులు

[మార్చు]

ఈ మందును ప్రతీ సంవత్సరం పంపిణీ చేసే బత్తిని సోదరులలో బత్తిని హరినాథ్ గౌడ్ ఒకడు. అతను 1944లో దూద్ బౌలి లో జన్మించాడు. అతని నానమ్మ చేప మందు తయారీ తన పిల్లలకు నేర్పింది. అతను 2023 ఆగస్టు 24న హైదరాబాదులో మరణించాడు. అతనికి భార్య సుమిత్రాదేవి,ఇద్దరు కుమారులు,ఇద్దరు కుమార్తెలు.

విశేషాలు

[మార్చు]

ఈ చేపప్రసాదంలో ఆయుర్వేదంతో పాటు పాల పిండి, ఇంగువా, బెల్లం, పసుపు లాంటి సహజసిద్ధమైన వనమూలికలు వాడుతారు.[ఆధారం చూపాలి] ఇందులో వాడే ప్రసాదంలో మంచినీరు కూడా బావినీరే కావడం విశేషం. అయితే ఈ శాస్త్రీయతకు హిందు ధర్మాన్ని జత చేస్తూ బత్తిని సోదరులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. భగవంతుని పూజ తరువాత ప్రసాదాన్ని తయారు చేస్తారు. 24 గంటల ముందునుంచి ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఈ చేప ప్రసాదం పంపిణీ కోసం కొర్రమీను చేప పిల్లల్ని వినియోగిస్తారు, జీవించి వున్నా చేప పిల్ల నోట్లో బత్తిని సోదరులు చేసిన మిశ్రమం చిన్న ముద్దను వుంచి ఉబ్బసం రోగుల చేత మింగిస్తారు. ఈ చేప ప్రసాదంపై అనేక వివాదాలు ఉన్నాయి. జన విజ్ఞాన వేదిక లాంటి కొన్ని సంస్థలు చేప ప్రసాదాన్ని ప్రతి ఏటా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. దీంతో ప్రతి సంవత్సరం చేపమందుపై చివరి వరకు కూడా ఓ స్పష్టత రానటువంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ప్రభుత్వాలు నిర్వహించేందుకు ముందుకు రాలేదు. చివరి వరకు ఇలాంటి పరిస్థితే ఉండడంతో తొక్కిసలాటలు జరిగి పలువురు మృతిచెందారు. అయినా చేపప్రసాదం మాత్రం ఆగలేదు. ఈ మందులో ఏటువంటి శాస్త్రీయ ఆధారాలు లేక పోవటంతో కోర్టు సూచన[2] మేరకు దీనిని చేపప్రసాదంగా వ్యవహరిస్తున్నారు.

ప్రసాదంలో రకాలు

[మార్చు]

బత్తిని సోదరులు ఇచ్చే ప్రసాదం మూడు రకాలుగా ఉంటుంది. శాకాహారులకు బెల్లంతో తయారు చేసిన ప్రసాదం, మాంసాహారులకు చేప ప్రసాదం, పథ్యం చేసే వారికి మూడో రకంగా ప్రసాదాన్ని పంచనున్నట్లు బత్తిని కుంటుంబీకులు చెబుతున్నారు. యేటా నాలుగు లక్షలకు పైగా వ్యాధిగ్రస్తులు వస్తారని, అందుకు కావలసిన ప్రసాదాన్ని తయారు చేశామని వారు తెలిపారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా మందు వేస్తామని, అయితే చేపలు మాత్రం బాధితులే తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. కాగా, చేప మందులో రెండు అంగుళాలు ఉన్న కొరమీనూ మాత్రమే తెచ్చుకోవాలని నిర్వాహకులు చెబుతున్నారు. వీటి అమ్మకం కోసం ప్రత్యేక స్టాళ్లు వుంటాయి. మృగశిర నుంచి వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. గాలిలో తేమ శాతం పెరిగి ఆస్తమా వ్యాధిగ్రస్తులపై ప్రభావం చూపుతుంది. అందువల్లే మృగశిర రోజే ఆస్తామా బాదితులకు ఈ మందును పంపిణీ చేస్తారు. అలాగే మృగశిరలో చాలా మంది చేపలను తినడం అనవాయితీగా వస్తుంది. ఈ రోజు చేపలను భుజించడం వల్ల ఆరోగ్యానికి మంచిదనే నమ్మకం ఉంది. అందుకే సంవత్సరంలో ఈ ఒక్క రోజైనా చేపలను తినాలని భావిస్తారు.

చరిత్ర

[మార్చు]

హైదరాబాదు సంస్థానాన్ని పాలించిన నాలుగో నిజాం నాసిరుద్దౌలా కాలంలో పాతబస్తీ దూద్‌బౌలికి చెందిన బత్తిని వీరన్న గౌడ్ బేగంబజార్ ప్రాంతంలో కల్లు కాపౌండ్ నిర్వహించేవాడు. ఒక రోజు భారీగా వర్షం పడుతుండగా తడిచిన ఓ సాధువు అక్కడికి రావడం గమనించిన వీరన్న గౌడ్ అతన్ని ఇంటికి తీసుకెళ్లి సపర్యలు చేశాడు. సంతృప్తి చెందిన ఆ సాధువు తాను వెళ్లే సమయంలో ఆస్తమా వ్యాధిని నయం చేసే వనమూలికలను బత్తిని వీరన్న గౌడ్‌కు చెప్పాడు. [ఆధారం చూపాలి] నగరంలో లభించే వనమూలికలతో ప్రసాదం తయారు చేసి, ఏటా మృగశిర కార్తె ప్రవేశించిన తొలినాడే ఎలాంటి లాభాపేక్షలేకుండా రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తే నీకు, నీ కుటుంబానికి మేలు జరుగుతుందని ఆ సాధువు వీరన్న గౌడ్‌కు తెలిపాడు. అప్పటి నుంచి వీరన్న గౌడ్ ప్రతి మృగశిర కార్తె ముందు రోజు నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇలా వీరన్న గౌడ్ తన ఇంటి వద్ద 1847లో చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించాడు. తదనంతరం తన కుమారుడు బత్తిని శివరామ గౌడ్, అతని కుమారుడు బత్తిని శంకర్‌గౌడ్ ఈ ప్రసాదాన్ని ఏటా వేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం శంకర్‌గౌడ్, సత్యమ్మ దంపతులకు కలిగిన ఐదుగురు కుమారుల్లో బత్తిని హరినాథ్ గౌడ్, బత్తిని ఉమామహేశ్వర్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు కలిసి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. దాదాపు 169 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చేపమందు ఇప్పుడు భాగ్యనగరం సొంతం. చేపమందుకు కోసం వచ్చే సంఖ్యను చూసి ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అల్లర్ల నేపథ్యంలో పాతబస్తీ నుంచి 1997 నిజాం కళాశాల మైదానానికి చేపమందు పంపిణీని ప్రభుత్వం మార్చింది.[3][4]

చేపమందు వివాదాలు

[మార్చు]

చేప ప్రసాదం శాస్త్రీయత పై అనేక వివాదాలు ఉన్నాయి. అయినా చేప ప్రసాదానికి మాత్రం ఆదరణ తగ్గటం లేదు. దీనికి అసలు శాస్త్రీయత లేదని చెబుతున్న జన విజ్ఞాన వేదిక గతంలో అనేకసార్లు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రతి యేటా మృగశిర కార్తె రోజున పంపిణీ చేసే చేప ప్రసాదంపై సిటీ సివిల్‌ కోర్టు 2012 లో తీర్పును వెలువరించింది. బత్తిన సోదరులు కూడా వారు పంపిణీ చేసే మిశ్రమాన్ని చేప ప్రసాదం అని వ్యవహరించటానికి అంగీకరించారు.[2] చేప ప్రసాదం తయారీ, పంపిణీ అంతా పరిశుభ్రమైన వాతావరణంలో, వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో జరపాలని ఆదేశించింది. చేప ప్రసాదాన్ని ఎక్కడా చేప మందుగా ప్రచారం చేయరాదని, వీటిని ఉల్లంఘించిన పక్షంలో సర్కారు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. చేప ప్రసాదంలో కీలకంగా మారిన చేపలు పూర్తిగా శుభ్రమైన నీటిలోనే వుండాలని కూడా న్యాయమూర్తి ఆదేశించాడు. చేప పిల్లలు తెచ్చే సమయం నుంచి పంపిణీ చేసే వరకు మంచి నీరు వుండాలని కూడా ఆదేశించారు. ఇక చేప ప్రసాదం పంపిణీ సమయంలో బత్తిన సోదరులు ప్రతిసారీ కచ్చితంగా చేతులు కడుక్కో వాలని, ఒకవేళ రోగులే స్వీకరిస్తే అవసరం లేదని జడ్జి పేర్కొన్నారు. పంపిణీ కేంద్రాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని, ఎక్కడా మందు అని వుండ రాదని, ఈ ఏర్పాట్లను బత్తిన సోదరులు స్వయంగా చేసుకోవాలని కూడా ఆదేశించారు.

చేప ప్రసాదం పంపిణీ నిలిపివేత

[మార్చు]
  1. దేశంలో కోవిడ్‌ –19, లాక్‌డౌన్ దృష్ట్యా 2020లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపట్టే చేప ప్రసాదం పంపిణీని నిలిపి వేస్తున్నామని బత్తిని హరినాథ్‌ గౌడ్ తెలిపాడు.[5][6]
  2. క‌రోనా వైర‌స్ రెండో వేవ్ కార‌ణంగా 2021లో కూడా చేప ప్ర‌సాదం పంపిణీ నిలిపివేస్తున్న‌ట్లు నిర్వాహకుడు బ‌త్తిని హ‌రినాథ్ గౌడ్ తెలిపాడు. జూన్ 8న చేపమందు ప్రసాదం కేవలం ఇంట్లో వాళ్లం మాత్రమే తీసుకుంటామని తెలిపాడు.[7][8]

చేప ప్రసాదం వేదికలు

[మార్చు]
  • బత్తిని హరినాథ్‌ గౌడ్‌ పూర్వీకుల నుంచి 1996 వరకు పాతబస్తీ దూద్‌బౌలిలోనే చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేవారు
  • 1997లో పాతబస్తీలో జరిగిన మత కలహాల కారణంగా ఈ వేదిక నిజాం కాలేజీ గ్రౌండ్‌కు మార్చారు.
  • 1998లో అప్పటి ప్రభుత్వం చేపప్రసాదం పంపిణీకి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ను కేటాయించింది.
  • అనంతరం 2012లో బత్తిని మృగశిర ట్రస్ట్‌కు కేటాయించిన కాటేదాన్‌లోని ఖాళీ స్థలంలో పంపిణీ జరిగింది. పంపిణీ సందర్బంగా తొక్కిసలాటలో ఒకరు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2013లో తిరిగి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీకి అనుమతించింది.
  • నాటి నుంచి 2019 వరకు చేప ప్రసాదం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోనే కొనసాగింది.
  • 2020 & 2021లో కరోనా వైరస్‌ కారణంగా పంపిణీ నిలిపివేశారు.[9]
  • 2023 జూన్ 9వ తేదీ నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో 32 కౌంటర్ల ద్వారా 80 వేల మందికి చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు.[10][11]

మూలాలు

[మార్చు]
  1. Business Insider (26 May 2022). "The fish prasadam remedy: Annual Festival where thousands swallow live fish to cure asthma". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023. {{cite news}}: |last1= has generic name (help)
  2. 2.0 2.1 http://www.10tv.in/news/Fish-medicine-for-asthma-is-not-a-medicine[permanent dead link]
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-12. Retrieved 2015-06-08.
  4. TV9 Telugu (6 June 2023). "చేప ప్రసాదానికి 171 ఏళ్లు.. ఈ నెల 8న సాయంత్రం పంపిణీ.. శరవేగంగా ఏర్పాట్లు." Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. TV9 Telugu (5 June 2020). "173 ఏళ్ల చరిత్రగల చేప ప్రసాదానికి.. కరోనా బ్రేక్..!". TV9 Telugu. Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Deccan Chronicle (11 May 2020). "No fish medicine for asthma this year". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.
  7. Sakshi (30 May 2021). "Hyderabad: ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ లేదు". Sakshi. Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.
  8. Andhrajyothy (30 May 2021). "ఈ ఏడాది చేపమందు పంపిణీ నిలిపి వేస్తున్నాం: బత్తిని హరినాథ్‌ గౌడ్". www.andhrajyothy.com. Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.
  9. Sakshi (8 June 2020). "చేప ప్రసాదం.. హుష్‌!". Sakshi. Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.
  10. Eenadu (10 June 2023). "చేప ప్రసాదం పంపిణీకి విశేష స్పందన". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
  11. Namasthe Telangana (10 June 2023). "80 వేల మందికి చేప ప్రసాదం". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.

ఇతర లింకులు

[మార్చు]